Kamepalli Tulasi Babu: తులసిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబు
- హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు
- ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
- నేడు పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులిసిబాబుకు ఏపీ హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. గుంటూరు డిస్ట్రిక్ట్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఇటీవలే ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా, తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. తాజాగా, తులసిబాబు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముఖ్య నిందితులు ఇంకా అరెస్ట్ కావాల్సి ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ రిటైర్డ్ అదనపు డీఎస్పీ విజయ్ పాల్ కు ఇటీవల గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తులసిబాబు గుంటూరు కోర్టులో కాకుండా హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి ఎదురుదెబ్బ తిన్నాడు.