Techie: రూ.7 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్.. కానీ ఏం లాభం జీవితంలో ఓడిపోయానంటున్న టెకీ

- మూడేళ్లుగా రోజుకు 14 గంటలు పనిచేసి తన లక్ష్యాన్ని సాధించానని వెల్లడి
- కెరీర్ కోసం కుటుంబాన్ని పట్టించుకోలేదని, ముఖ్యమైన ఫంక్షన్లకూ హాజరుకాలేదని వివరణ
- చివరకు ప్రమోషన్ సాధించిన సంతోషం భార్య విడాకులు కోరడంతో ఆవిరైందన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్
‘కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మూడేళ్ల పాటు నిరంతరం శ్రమించా.. ఎట్టకేలకు నా గోల్ సాధించా. రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్ అందుకున్నా.. కానీ నాకు సంతోషంగా లేదు’ అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి విడాకుల నోటీస్ అందుకున్నానంటూ వాపోతున్నాడు. పేరుతో పాటు ఇతరత్రా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తన ఆవేదనను ఈ పోస్టులో వివరించాడు.
మూడేళ్ల కిందట తాను ఓ కంపెనీలో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్ గా చేరానని పోస్టులో చెప్పుకొచ్చాడు. ప్రమోషన్ కోసం రోజుకు 14 గంటలు పనిచేశానని వివరించాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం మీటింగ్ లతో బిజీబిజీగా ఉండేవాడినని చెప్పాడు. ఈ క్రమంలో తన కూతురు పుట్టిన సమయంలో భార్య పక్కన ఉండే అవకాశాన్ని వదులుకున్నట్లు వివరించాడు. ఆ సమయంలోనూ తాను వర్క్ లో మునిగిపోయానని, ప్రసవం తర్వాత తన భార్య మానసికంగా ఒడిదుడుకులకు గురైందని చెప్పాడు.
కౌన్సిలింగ్ కోసం డాక్టర్ ను కలిసేందుకు భార్య వెళితే తాను తోడుగా వెళ్లలేదన్నాడు. బంధుమిత్రులను కలవడం, శుభకార్యాలకు హాజరు కావడం వంటివన్నీ త్యాగం చేసి ఉద్యోగానికే అంకితమయ్యానని వివరించాడు. మూడేళ్ల తర్వాత తనకు ప్రమోషన్ వచ్చిందని, రూ.7.8 కోట్ల వార్షిక వేతనం అందుకోబోతున్నానని తెలిపాడు. అయితే, భార్య తనతో కలిసి ఉండేందుకు ఇష్టపడడంలేదని, విడాకులు కోరుతోందని చెప్పాడు. ఏ ప్రమోషన్ కోసం అయితే, మూడేళ్లు కష్టపడ్డానో అదే తన వ్యక్తిగత జీవితంలో మంట పెట్టిందని వాపోతున్నాడు. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కూతురు పుట్టబోతుందని తెలిసీ ఆ క్షణాన్ని ఆస్వాదించకుండా ఉద్యోగ విధుల్లో మునిగిపోవడమేంటని విమర్శిస్తూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.