Shaheen Afridi: మాథ్యూను కావాలనే రెచ్చగొట్టాను.. సౌతాఫ్రికా బ్యాటర్‌తో గొడవపై పాక్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిది

- అతడి వికెట్ తీయాలన్న ఉద్దేశంతో టీజ్ చేశానని అంగీకరించిన అఫ్రిది
- ఆ గొడవ అక్కడే ముగిసిందన్న పాక్ బౌలర్
- ఆ తర్వాత తామిద్దం చేతులు కలుపుకొని ఫ్రెండ్స్ అయ్యామని వెల్లడి
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కేతో జరిగిన గొడవపై పాక్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిది ఎట్టకేలకు నోరు విప్పాడు. సౌతాఫ్రికా బ్యాటింగ్ 28వ ఓవర్‌లో షహీన్ వేసిన బంతిని మాథ్యూ బలంగా కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో షహీన్ ఉద్దేశపూర్వకంగా మాథ్యూను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మాథ్యూ అతడిని ఢీకొట్టాడు. ఇది ఇద్దరి మధ్య వాగ్వివాదానికి కారణమైంది. ఆ తర్వాత కెప్టెన్ బవుమా రనౌట్ సమయంలోనూ పాక్ ఆటగాళ్లు అనుచితంగా ప్రవర్తించారు.
ఈ రెండు ఘటనలతో పాక్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాజాగా స్పందించిన షహీన్ అఫ్రిది.. క్రీజులో కుదురుకోకుండా చేయడంతోపాటు మాథ్యూ వికెట్ తీసే ఉద్దేశంతో టీజ్ చేశానని అంగీకరించాడు. అయితే, ఆ గొడవ మైదానంలోనే ముగిసిందని, మ్యాచ్ అనంతరం ఇద్దరం చేతులు కలుపుకొన్నామని వివరించాడు.
‘‘తొలిసారి మాథ్యూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అయినప్పటికీ అతడి వికెట్ తీయాలన్న ఉద్దేశంతో టీజ్ చేస్తూనే ఉన్నాను. మైదానంలో ఏం జరిగిందో, అది అక్కడే ముగిసింది. ఆ తర్వాత మేమిద్దరం కలుసుకున్నాం. చేతులు కలుపుకున్నాం. ఇద్దరం స్నేహితులమయ్యాం’’ అని షహీన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
కాగా, మైదానంలో అనుచిత ప్రవర్తన కారణంగా షహీన్ తన మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని జరిమానాగా చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన సౌతాఫ్రికా ఓటమి పాలైంది. గెలిచిన పాక్ నేడు న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో తలపడనుంది.