Gautam Adani: ఓటమి చివరి గమ్యస్థానం కాదు.. పరీక్షల కంటే జీవితం చాలా పెద్దది: గౌతం అదానీ

Life gives second chance says Gautam Adani

  • జేఈఈ పరీక్షల్లో విఫలమైనందుకు విద్యార్థిని ఆత్మహత్య
  • యువతి ఆత్మహత్య తన హృదయాన్ని కలచివేసిందన్న అదానీ
  • జీవితం ఎప్పుడూ రెండో చాన్స్ ఇస్తుందన్న ఇండియన్ బిలియనీర్ 
  • చదువులో, జీవితంలో తాను చాలాసార్లు విఫలమయ్యానని గుర్తు చేసుకున్న అదానీ 
  • ఓడిన ప్రతిసారీ జీవితం ఓ కొత్త మార్గాన్ని చూపిందని వెల్లడి 

పరీక్షల కంటే జీవితం చాలా పెద్దదని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ పేర్కొన్నారు.  ఓటమి ఎప్పుడూ చివరి గమ్యం కాదని, జీవితం ఎప్పుడూ రెండో చాన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జేఈఈ పరీక్షల్లో విఫలమైన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అదానీ ఇలా స్పందించారు.  

‘‘నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒక్కటే. ఓటమిని ఎప్పుడూ చివరి గమ్యస్థానంగా భావించవద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ రెండో అవకాశం ఇస్తుంది’’ అని అదానీ పేర్కొన్నారు. యువతి ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆశలు పెట్టుకున్న కూతురు అంచనాల ఒత్తిడి మధ్య నలిగి వెళ్లిపోవడం హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తల్లిదండ్రుల కలలు నెరవేర్చడంలో విఫలమైనందుకు తనను క్షమించాలంటూ సూసైడ్ నోట్ రాసిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన అదానీ.. ఈ పోస్టు చేశారు. పిల్లలతో పాటు తమపై కూడా ఒత్తిడి లేకుండానే చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. 

‘‘పరీక్ష ఏదైనా దానికంటే జీవితం చాలా పెద్దది.  ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి’’ అని అదానీ పేర్కొన్నారు. చదువులో తాను కూడా సాధారణ విద్యార్థినేనని, చదువుతోపాటు జీవితంలోనూ చాలాసార్లు విఫలమయ్యానని గుర్తు చేసుకున్నారు. ఓటమి చెందిన ప్రతిసారీ జీవితం తనకు కొత్త మార్గాన్ని చూపిందని అదానీ వివరించారు.  

More Telugu News