Errabelli Dayakar Rao: ఆ విషయం నాకు ఆరు నెలల ముందే తెలుసు: ఎర్రబెల్లి

- అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ఆరు నెలల ముందే తెలుసన్న మాజీ మంత్రి
- అధినేత కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఎన్నికల్లో పోటీ చేసినట్లు వెల్లడి
- రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్లు దార్శనికతతో పాలించారన్న ఎర్రబెల్లి
- కాంగ్రెస్ 15 నెలల్లోనే అన్ని రంగాల్లో దివాలా తీయించిందని విమర్శ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానన్న విషయం తనకు ఆరు నెలల ముందే తెలుసని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కానీ, అధినేత కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దార్శనికతతో పాలిస్తే.. కాంగ్రెస్ 15 నెలల్లోనే అన్ని రంగాల్లో దివాలా తీయించిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందన్నారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ పనితీరును పరిశీలించడానికి ఇటీవల వరంగల్ కు రావడానికి రాహుల్ గాంధీ యత్నించారని, కానీ తన నిజస్వరూపం బయటపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి... ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆయన పర్యటనను రద్దు చేయించారని అన్నారు. రాష్ట్రంలో సీఎం సోదరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.