Manchu Manoj: నన్ను తొక్కాలన్నా, పైకి లేపాలన్నా అది అభిమానుల చేతిలోనే ఉంది: మంచు మనోజ్

- 'జగన్నాథ్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మనోజ్ కీలక వ్యాఖ్యలు
- అభిమానులే తన దేవుళ్లు, తన కుటుంబం అన్న మనోజ్
- తనను ఏం చేయాలన్నా అది ఫ్యాన్స్ వల్లే అవుతుందని వ్యాఖ్య
'జగన్నాథ్' అనే మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన సందర్భంగా హీరో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది నాపై బురద చల్లాలని చూసినా, ఆ నాలుగు గోడల మధ్యకు రానీయకపోయినా మీ గుండెల్లో నుంచి మాత్రం నన్ను తీయలేరు. అభిమానులే నా దేవుళ్లు, నా కుటుంబం, నాకన్నీ. నన్ను తొక్కాలన్నా, పైకి లేపాలన్నా అది అభిమానుల చేతిలోనే ఉంది. నన్ను ఏం చేయాలన్నా అది ఫ్యాన్స్ వల్లే అవుతుంది. న్యాయం కోసం నిలబడ్డానంటే అది జరిగే వరకూ నేను ఎంత దూరమైనా వెళతాను" అని మనోజ్ అన్నారు.
ఇక ఈ రోజుల్లో సినిమా తీయడం అనేది తేలికైన విషయం కాదన్నారు. రూ.కోటితో తీసినంత మాత్రాన చిన్న సినిమా కాదు, రూ. వేల కోట్లతో తీస్తే.. పెద్ద సినిమా అయిపోదన్నారు. సినిమా అంటే సినిమానే అని, బాగుందా? లేదా? అనేది ముఖ్యమన్నారు. సినిమా గొప్పది కాబట్టే తాను తల్లితో పోలుస్తుంటానని మనోజ్ చెప్పుకొచ్చారు.