Raja Singh: సొంత పార్టీ బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

BJP MLA Raja Singh Sensational Comments On Own Party

  • పార్టీలో చేరినప్పటి నుంచీ వేధింపులు భరిస్తున్నానన్న గోషామహల్ ఎమ్మెల్యే
  • పార్టీకి తాను అవసరం లేదనుకుంటే వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానన్న రాజాసింగ్
  • రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉండంటం వల్లే ఇక్కడ బీజేపీ అధికారానికి దూరమైందని వ్యాఖ్య

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని పార్టీకి తాను సూచించానని, కానీ, తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వ్యక్తికి ఆ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారని, దీనిని బట్టి తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందని రాజాసింగ్ వివరించారు. 

పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని, కానీ, తన సూచనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలని, అలాగే వెంటనే అధ్యక్షుడిని మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News