Vallabhaneni Vamsi: వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టుపై ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ‌, ఆర్‌టీసీ ఛైర్మ‌న్ ఏమ‌న్నారంటే..!

What Did MLA Yarlagadda and APSRTC Chairman Konakalla Narayana say about Vallabhaneni Vamsis Arrest

  • సభ్య సమాజం తల దించుకునేలా వంశీ ప్రవర్తన ఉంటుంద‌న్న‌ యార్లగడ్డ వెంకటరావు
  • వైసీపీలో అవమానాలు భ‌రించ‌లేక తాను పార్టీ మారాన‌న్న ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ‌
  • జ‌గ‌న్‌కు రౌడీలంటే ఇష్టమని, అందుకే వల్లభనేని వంశీని పార్టీలోకి తీసుకున్నార‌ని వ్యాఖ్య‌ 
  • అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీ పార్టీదేన‌న్న‌ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ
  • వంశీ హయాంలో గన్నవరంలో 4వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోప‌ణ‌

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ మంత్రి వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు ఈ రోజు ఉద‌యం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న అరెస్టుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

సభ్య సమాజం తల దించుకునేలా వంశీ ప్రవర్తన ఉంటుంది: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు
ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సినవారే చీడ పురుగుల్లా తయారయ్యారని, నాయకుడు మంచోడైతే సమాజానికి మంచి జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెద్ద పెద్ద మహానుభావులు పుట్టిన నేలపై వల్లభనేని వంశీ పుట్టి ఈ నేలను అపవిత్రం చేశారన్నారు. గత 10 సంవత్సరాల నుంచి గన్నవరంలో  మట్టిని అక్రమంగా తరలించారని దుయ్య‌బ‌ట్టారు. 

తెలుగుదేశం ప్రభుత్వం గన్నవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే వంశీ దాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సభ్య సమాజం తల దించుకునేలా వంశీ ప్రవర్తన ఉంటుందని, వంశీలో ఏం చూసి జగన్ పార్టీలోకి తీసుకున్నాడో తెలియదన్నారు. నేడు ప్ర‌జ‌లు జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. చంద్రబాబు హోదా పోగొట్టడానికి రాజీ పడమంటే నేను రాజీ పడలేద‌ని తెలిపారు. త‌న‌కు క్యారెక్టర్ ముఖ్యమని చెప్పానని, జగన్ ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తారన్నారు. 

2014, 2019లో పోటీ చేసిన  డాక్టర్ రామచంద్ర గానీ, తాను గానీ ఎప్పుడూ బూతులు మాట్లాడలేద‌న్నారు. తాము పోటీ చేసినప్పుడు ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. తనపై అనేక నిరాధార నిందలు మోపారని, గన్నవరంలో 400 మంది వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టించినా అన్నీ గాలికొదిలి వంశీని జగన్  పార్టీలోకి తీసుకున్నాడన్నారు. వైసీపీలో అవమానాలు మోయలేక తాను పార్టీ మారిన‌ట్లు చెప్పారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసేయాలనే వంశీని జగన్ పార్టీలోకి తీసుకున్నాడని తెలిపారు. 

ఆయ‌న‌కు రౌడీలంటే ఇష్టమని, వల్లభనేని వంశీ కూడా ఒక రౌడీ కాబట్టి అత‌డిని జగన్ తన పార్టీలోకి చేర్చుకున్నాడని విమ‌ర్శించారు. వంశీ అక్రమ లే అవుట్లతో కామన్ సైట్లన్నీ అన్యాక్రాంతం చేశాడని ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలంలో రోడ్లకు ఆనుకొని ఉన్న భూములను కార్పొరేషన్ లో లేకుండా చేశారని, రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లే అవుట్ లో కూడా కామన్ సైట్ వాడుకోలేని పరిస్థితి తీసుకొచ్చి అన్ని కబ్జాలు చేశారని మండిప‌డ్డారు. 

బ్రహ్మానంద చెరువు, పోలవరం మట్టిని అమ్ముకున్న పాపం ఊరికే పోదని, అది శాపంలా వెంటాడుతుందని వంశీకి నేను పలుమార్లు చెప్పానని గుర్తు చేశారు. పోలవరం మట్టిని తవ్వడం వల్లనే అంబాపురం వద్ద ఇటీవల బుడమేరు పొంగి విజయవాడను ముంచాయన్నారు. ఎయిర్ పోర్టు భూముల్లో కూడా వంశీ అవినీతికి పాల్పడ్డారన్నారు. వైసీపీ నాయకుడైన తోట వెంకయ్య అనే డాక్యుమెంట్ రైటర్ ను అడ్డం పెట్టుకొని అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. పదేళ్లుగా ఎమ్మార్వోలుగా పనిచేసిన వారిమీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరారు. ఈ మేర‌కు తాను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్ర‌బాబును కోరుతానన్నారు. 

మాధురి, పాత ఎమ్మార్వో నరసింహులు ఇద్దరు క‌లిసి ట్యాంపరింగ్ చేయని రికార్డులు లేవన్నారు.  తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు వంశీ కోసం పనిచేసిన వారి మీద వంశీ అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. నరసయ్య ఇంటిపై దాడి చేసిన మాట వాస్తవం కాదా? రంగబాబు కాళ్లు విరగ్గొట్టిన మాట వాస్తవం కాదా?  అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రశ్నించారు.

అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీ పార్టీది: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ 
అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీ పార్టీది అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వ్యాఖ్యానించారు. ఇవాళ‌ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని వైసీపీ నాయకులంటున్నారని, అక్రమ అరెస్టులకు, కక్ష సాధింపుల విష‌యంలో వైసీపీ నాయకులకు సాటి ఎవరూ లేరన్నారు. చంద్రబాబు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగం చేసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. 

2023 లో గన్నవరం టీడీపీ ఆఫీసులో సమావేశం జరుగుతుంటే వంశీ నాయకత్వంలోని అల్లరి మూకలు పార్టీ ఆఫీసుపై దాడి చేశార‌న్నారు. ఆ స‌మ‌యంలో కార్లు తగలబెట్టి, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తే  సత్యవర్ధన్ ఫిర్యాదు చేస్తే నాటి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. పైగా ధ్వంసం చేసింది తెలుగుదేశం పార్టీ ఆఫీసునయితే... కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ నాయకులూ, కార్యకర్తల పైన ఇంత కన్నా అన్యాయమేంటని ప్రశ్నించారు. ఆడవారిపై కూడా కేసులు బనాయించి నిర్బంధంలో ఉంచిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు. 

ఆఫీసులో పని చేసే షెడ్యూల్ కులానికి చెందిన సత్యవర్ధన్ దాడిపై ఫిర్యాదు చేస్తే ఆ కంప్లైంట్ ని బలహీనపరిచేందుకు అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి సాక్ష్యాలను తయారు మారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. కిడ్నాప్ పై సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు చేసిన కంప్లైంట్ కి వంశీని పోలీసులు అరెస్ట్ చేసారన్నారు. దళితుల్ని కిడ్నాప్ చేసి  బెదిరించి, లొంగదీసుకుని కేసుని తారుమారు చేయాలని చూసింది వాస్తవం కాదా అని ఆయ‌న‌ ప్రశ్నించారు. 

ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం సాక్షుల్ని బెదిరించడం తీవ్రమైన నేరమని, అక్రమ కేసులని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు వారిని మించిన అక్రమార్కులు ఎవరూ లేరన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ దుర్మార్గాలకు అంతే లేదన్నారు.  పోలవరం కాల్వపై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. బ్రహంలింగం చెరువులోని మట్టిని తవ్వేసి అమ్ముకుని, ఎయిర్ పోర్టు భూముల్ని కూడా వదలకుండా తవ్వేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నకిలీ పట్టాలిచ్చి ప్రజలని  మోసం చేసిన దుర్మార్గుడు వంశీ అని అన్నారు. 

వంశీ హయాంలో గన్నవరంలో 4వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. వంశీ చేసిన దుర్మార్గాలు, అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు చట్టం ముందు సమానమేనని, చేసిన తప్పులకు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. వైసీపీ నాయకులు అక్రమ అరెస్టులని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. లోకేశ్‌ ప్రజాస్వామ్య పద్దతిలో పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా ఆటంకాలు సృష్టించి త‌న‌పై, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకటరావులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసులు పెట్టే సంస్కృతి వైసీపీదే అని కొనకళ్ల నారాయణ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News