Pochampalli Srinivas Reddy: మొయినాబాద్ కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు

- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు
- కోడి పందేల నిర్వహణపై వివరణ ఇవ్వాలని పేర్కొన్న పోలీసులు
- మొయినాబాద్ మండలంలో క్యాసిన్, కోడిపందేల నిర్వహణ కేసులో పలువురి అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలంలో ఒక ఫాంహౌస్‌లో కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. కోడి పందేల నిర్వహణపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఈ ఫాంహౌస్‌ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎమ్మెల్సీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు.
మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫాంహౌస్‌లో మంగళవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో 64 మందిని అరెస్ట్ చేశారు. క్యాసినో, కోడిపందేల నిర్వహణ జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఆర్గనైజర్లు భూపతిరాజు, శివకుమార్‌లను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలంలో రూ.30 లక్షలు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్లు, పేకాట కార్డులు, పందెం కోళ్ల కోసం ఉపయోగించే 46 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 64 మందిలో 51 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు, ఏడుగురు హైదరాబాద్ వాసులు ఉన్నారు.