Kollu Ravindra: కేసు నుంచి తప్పించుకునేందుకు వల్లభనేని వంశీ మరో తప్పు చేశాడు: కొల్లు రవీంద్ర

- కక్షపూరిత రాజకీయాలు చేసి ఉంటే నెలలోపు అందరినీ లోపల వేయించేవాళ్లమన్న కొల్లు
- చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్య
- వంశీ పాపాల పుట్ట బద్దలైందన్న దేవినేని ఉమా
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేట్రేగిపోయారని మండిపడ్డారు.
కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని... కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లమని రవీంద్ర అన్నారు. ఒక నాయకుడు క్యాసినో పెట్టి, నోరుంది కదా అని బూతులు తిట్టాడని... మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్ లో ఇరికించాడని... ఇంకో నాయకుడు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాడని... ఇలాంటి చర్యలను ఉపేక్షించాలా? అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ... ఫిర్యాదు చేసిన వ్యక్తినే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారని మండిపడ్డారు. వంశీ వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డాడని అన్నారు. అరెస్ట్ సమయంలో వంశీ ఎవరితో ఫోన్ లో మాట్లాడారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వంశీ పాపాల పుట్ట బద్దలైందని అన్నారు.