Bengaluru: కారు నడుపుతూ ల్యాప్ టాప్ లో వర్క్ చేసిన మహిళ.. వీడియో ఇదిగో!

- బెంగళూరులో నిర్లక్ష్యంగా కారు నడిపిన మహిళ.. ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు
- వర్క్ ఫ్రం హోం అంటే ఇంట్లో నుంచి చేయాలి కానీ డ్రైవింగ్ చేస్తూ కాదంటూ ట్వీట్
- మహిళ నిర్లక్ష్యంపై మండిపడుతున్న నెటిజన్లు
బెంగళూరులో ఓ మహిళ కారులో కూర్చుని ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు వెనక సీట్లోనో, డ్రైవర్ పక్క సీట్లోనో కూర్చుని వర్క్ చేస్తే పర్వాలేదు కానీ సదరు మహిళ కారు నడుపుతూనే స్టీరింగ్ పై ల్యాప్ టాప్ పెట్టుకుని పని చేయడంతో వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించాలని సంబంధిత కంపెనీని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీ నగర్ ప్రాంతంలో మహిళ చేసిన సర్కస్ ఫీట్ ను మరో కారులో వెళుతున్న వారు వీడియో తీసి ట్రాఫిక్ పోలీసులకు షేర్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.. సదరు కారు ఎవరిది, కారు నడిపిన మహిళ ఎవరనేది ఆరా తీశారు.
మరుసటి రోజు పొద్దున్నే ఇంటికి వెళ్లి ‘వర్క్ ఫ్రం హోం అంటే ఇంట్లో కూర్చుని చేయాలి కానీ ఇలా కారు స్టీరింగ్ ముందు కూర్చుని కాదు’ అని మందలించారు. అంతేకాదు, రూ.వెయ్యి చలానా చేతిలో పెట్టారు. ఈ వీడియోను, చలానా అందిస్తున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ మీ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకూ ముప్పు అని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.