Somireddy Chandra Mohan Reddy: వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్ చేయాలి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

- వల్లభనేని వంశీ ఒక మృగం అన్న సోమిరెడ్డి
- వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే చంపేసేవారని వ్యాఖ్య
- వంశీలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదన్న సోమిరెడ్డి
వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల వాహన శ్రేణి నందిగామ వరకు వచ్చింది. మరో అరగంటలో వీరు విజయవాడకు చేరుకుంటారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో గన్నవరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మరోవైపు, వంశీ అరెస్ట్ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంశీ మనిషి కాదని, ఆయన ఒక మృగమని అన్నారు. వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే చంపేసేవారని... ఇక్కడ కాబట్టి బతికిపోయాడని చెప్పారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి వంశీ అని అన్నారు.
పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా వంశీ డ్రామాలు ఆడాడని... డ్రెస్ మార్చుకుంటానని లోపలకు వెళ్లి ఫోన్లు చేసి, అల్లర్లకు పాల్పడాలని అనుచరులకు చెప్పాడని సోమిరెడ్డి మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని, కార్లు తగులబెట్టారని, మనుషులను చంపేందుకు కూడా యత్నించారని అన్నారు. కేసు పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్ ని భయపెట్టాడని చెప్పారు.
వంశీ బతుకు ఇప్పుడు బయటపడిందని అన్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని అన్నారు. వంశీతో పాటు మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పారు.