Mohan Babu: మోహన్ బాబుకు భారీ ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు

Supreme grants anticipatory bail to actor Mohan Babu

  • జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు
  • ముందస్తు బెయిల్ నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
  • ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో, ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మోహన్ బాబు పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.   

హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మోహన్ బాబు మైక్ తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు విచారణ సందర్భంగా కావాలని తాను జర్నలిస్టుపై దాడి చేయలేదని సుప్రీంకోర్టుకు మోహన్ బాబు తెలిపారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు. బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు. సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద కూడా హై డ్రామా నడిచింది. ఇరు పక్షాల బౌన్సర్లు కొట్టుకున్నారు. చివరకు పోలీసుల అనుమతితో క్యాంపస్ లోపల ఉన్న తన తాత, నానమ్మల సమాధులను మనోజ్ దర్శించుకుని బయటకు వచ్చారు.

Mohan Babu
Tollywood
Supreme Court
  • Loading...

More Telugu News