Shikhar Dhawan: ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. శిఖ‌ర్ ధావ‌న్ కు అరుదైన గౌర‌వం!

Shikhar Dhawan Appointed as The Brand Ambassador for the ICC Champions Trophy

  • ఈ నెల‌ 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
  • ఈ ట్రోఫీకి న‌లుగురు అంబాసిడ‌ర్ల‌ను ఎంపిక చేసిన ఐసీసీ
  • ధావన్‌తో పాటు సర్ఫరాజ్ అహ్మద్, షేన్ వాట్సన్, టిమ్ సౌథీలు ఈ టోర్నీకి అంబాసిడ‌ర్లు
  • ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అన్న గ‌బ్బ‌ర్‌

ఈ నెల‌ 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ట్రోఫీకి అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఎంపిక‌య్యాడు. ఈ మేర‌కు బుధవారం ఐసీసీ మొత్తం నలుగురు అంబాసిడ‌ర్ ల‌ను ప్ర‌క‌టించింది.

ధావన్‌తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత అయిన పాకిస్థాన్‌ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్, న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలను ఐసిసి ఈ టోర్నీకి అంబాసిడ‌ర్లుగా ఎంపిక చేసింది.

ఇక 2013లో మ‌హేంద్ర సింగ్‌ ధోనీ సార‌థ్యంలో టీమిండియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెల‌వ‌డంలో గ‌బ్బ‌ర్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడిష‌న్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన అతడు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ధావ‌న్ పేరిట ఉంది. అటు టోర్నీ చ‌రిత్ర‌లో వ‌రుస‌గా రెండుసార్లు 'గోల్డెన్ బ్యాట్' అవార్డు అందుకున్న ఏకైక క్రికెట‌ర్ కూడా అత‌డే. అందుకే గ‌బ్బ‌ర్ కు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది.  

"ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఈ రాబోయే ఎడిషన్‌ను అంబాసిడర్‌గా ఆస్వాదించే అవకాశం లభించడం గౌరవప్రదమైన విషయం. ఇది అభిరుచి, గర్వం, దృఢ సంకల్పం నుంచి పుట్టిన టోర్నమెంట్. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా ఉత్కంఠభరితమైన, భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన క్షణాలు ఎప్ప‌టికీ నా మ‌దిలో ప‌దిలంగా ఉంటాయి. రాబోయే వారాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు ప్రతి మ్యాచ్‌లో నువ్వా? నేనా? అన్న‌ట్టుగా పోటీప‌డ‌టాన్ని మనం చూస్తాం" అని ధావన్ ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News