V Hanumantha Rao: కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: వి.హనుమంతరావు డిమాండ్

- అంబేద్కర్ తర్వాత గొప్ప నేత సంజీవయ్య అన్న వీహెచ్
- కర్నూలులో సంజీవయ్య స్మృతివనం నిర్మాణంలో పురోగతి లేదని వ్యాఖ్య
- ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని మండిపాటు
కర్నూలులో సంజీవయ్య స్మృతివనం నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ చెప్పారని... స్మృతివనం నిర్మాణం కోసం రూ. 2 కోట్లు కేటాయించారని... అయితే ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. అంబేద్కర్ తర్వాత ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నేత సంజీవయ్య అని... ఆయనకు మరింత గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ... అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని వీహెచ్ మండిపడ్డారు. తమ నేత రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసును నమోదు చేసి, సమన్లు జారీ చేసిందని చెప్పారు. ఇదే సమయంలో రాజ్యాంగాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారని, దేశ స్వాతంత్ర్యాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అవమానించారని... వీరిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.