bulli raju revanth bhimala: మా 'బుల్లి రాజు'కు రాజకీయాలు ఆపాదించొద్దు... తండ్రి విజ్ఞప్తి

- 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలనటుడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల
- రేవంత్ భీమాల పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్‌లు
- ఫేక్ అకౌంట్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రేవంత్ భీమాల తండ్రి శ్రీనివాసరావు
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో బుల్లి రాజుగా తెరంగేట్రం చేసిన బాల నటుడు రేవంత్ భీమాలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రేవంత్ భీమాల. ఈ క్రమంలో రేవంత్ భీమాల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంపై రేవంత్ తండ్రి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తమ కుమారుడి పేరు మీద ఫేక్ అకౌంట్లు సృష్టించి ఒక సినిమా ప్రచారం కోసం చేసిన వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని శ్రీనివాసరావు అన్నారు. ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు.
తమ కుమారుడికి ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ కుమారుడు రేవంత్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, బుల్లి రాజుగా రేవంత్‌ను ఆదరించి, ఆశీస్సులు అందజేసిన తెలుగు ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.