Telangana: తెలంగాణలో మరోసారి కులగణన: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన

- రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీసర్వే నిర్వహించనున్నట్లు వెల్లడి
- సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఉపముఖ్యమంత్రి
- రాష్ట్రంలో 3.1 శాతం జనాభా సర్వేలో పాల్గొనలేదని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కులగణన చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదివరకు చేసిన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 3.1 శాతం మంది ఇదివరకు జరిపిన సర్వేలో పాల్గొనలేదని, ఈ నేపథ్యంలో వారిని రాష్ట్ర జనాభా లెక్కల్లోకి తీసుకురావడం కోసం మరోసారి సర్వే చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో దాదాపు 25 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ఈ సర్వేతో పాటు కులగణన కూడా చేపట్టి ఇందుకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.