Kakani Govardhan Reddy: ప్రభుత్వ పరిహారాన్ని కూడా కొట్టేశారు: సోమిరెడ్డిపై కాకాణి ఫైర్

- పేదల భూములను తక్కువ ధరకు సోమిరెడ్డి కొనుగోలు చేశారన్న కాకాణి
- భూముల అవినీతిపై విచారణ జరిపే దమ్ము చంద్రబాబుకు కూడా లేదని వ్యాఖ్య
- కమీషన్ల కోసం పరిశ్రమలను కూడా సోమిరెడ్డి అడ్డుకుంటున్నారని మండిపాటు
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రామదాసు కండ్రిగలోని పేదల నుంచి భూములను తక్కువ ధరకు సోమిరెడ్డి కొనుగోలు చేశారని... ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని కూడా కొట్టేశారని తెలిపారు. ఈ భూములపై సీఐడీ అధికారుల చేత విచారణ చేయించే దమ్ము సోమిరెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.
తనపై సోమిరెడ్డి 17 విజిలెన్స్ విచారణలు చేయించారని... తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసం పరిశ్రమలు కూడా రాకుండా సోమిరెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల్లో కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. రామదాసు కండ్రిగ భూముల అవినీతిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబుకు కూడా లేదని చెప్పారు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా రాస్తోందని మండిపడ్డారు.