Narendra Modi: మొదటి ప్రపంచయుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ఫ్రాన్స్ లో నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

- ఫ్రాన్స్ లో మోదీ పర్యటన
- మెజార్గ్విస్ వద్ద భారత అమరవీరులకు నివాళి
- మాసేలో భారత కాన్సులేట్ కు ప్రారంభోత్సవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు మోదీ నివాళులు అర్పించారు. మెజార్గ్విస్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళులు అర్పించారు.
మోదీ తన పర్యటనలో భాగంగా మాసేలో భారత నూతన కాన్సులేట్ ను కూడా ప్రారంభించారు. దీని గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ... మాసేలోని భారత కాన్సులేట్ ద్వారా ఇరుదేశాల బంధం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కాన్సులేట్ భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, పరస్పర ప్రజా సంబంధాల పటిష్టతకు వారధిలా నిలుస్తుందని అభివర్ణించారు. ఈ కాన్సులేట్ ప్రారంభోత్సవంలో కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పాల్గొన్నారు.


