Mark Zuckerberg: పాకిస్థాన్ లో నాకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారు.. జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు!

- ఎవరో ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టులకు తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారన్న మెటా సీఈఓ
- ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న జుకర్ బర్గ్
- ఈ సందర్భంగా పాక్ లో ఫేస్‌బుక్ పై నమోదైన దావా గురించి వెల్లడి
ఎవరో ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టులకు పాకిస్థాన్ లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సీఈఓ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాక్ లో ఫేస్‌బుక్ పై నమోదైన దావా గురించి వెల్లడించారు.
జుకర్ బర్గ్ మాట్లాడుతూ... "ఇతర దేశాల్లో మనం అంగీకరించని చట్టాలు చాలా ఉన్నాయి. ఎవరో ఫేస్‌బుక్ లో దేవుడిని అవమానిస్తూ ఉన్న ఫొటోలను పోస్టు చేయడంతో పాక్ లో నాకు మరణశిక్ష విధించాలని మరెవరో దావా వేశారు. నాకు ఆ దేశానికి వెళ్లాలని లేదు. అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయి. దాంతో యాప్ లోని చాలా కంటెంట్‌ను తొలగించాల్సి వస్తోంది. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా మమ్మల్ని జైల్లో వేసేంత శక్తిమంతంగా ఆ రూల్స్ ఉంటాయి. విదేశాలలో అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలి" అని జుకర్ బర్గ్ తెలిపారు.
ఇదిలాఉంటే... 2024 ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఎక్స్, ఫేస్‌బుక్ తో సహా పలు సోషల్ మీడియా సైట్స్ ను పాకిస్థాన్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్లు ఆరోపించింది.