Pawan Kalyan: దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగత అంశం: పవన్ కల్యాణ్

- దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరిన పవన్
- కేరళలోని అగస్త్య ఆలయం సందర్శన
- తన తాజా పర్యటనకు రాజకీయాలతో సంబంధంలేదని స్పష్టీకరణ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న అగస్త్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశం అని స్పష్టం చేశారు.
తన తాజా పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఇది వ్యక్తిగత పర్యటన అని, నాలుగున్నరేళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన ఆరోగ్యం సహకరించకున్నా వచ్చానని తెలిపారు.
కాగా, ఈ ఆధ్యాత్మిక పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అకిరా నందన్, సన్నిహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.