Team Australia: చాంపియన్స్ ట్రోపీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. కొత్త కెప్టెన్‌గా స్మిత్

- చాంపియన్స్ ట్రోఫీకి పేస్ దిగ్గజాల దూరం
- గాయంతో కమిన్స్, హేజెల్‌వుడ్ దూరం
- వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్న హేజెల్‌వుడ్
- పేస్ దిగ్గజాలు లేకుండానే టోర్నీకి కంగారూలు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పేస్ దిగ్గజాలు మిచెల్ స్టార్క్, జోష్ హేజెల్‌వుడ్ జట్టుకు దూరమయ్యారు. కమిన్స్, హేజెల్‌వుడ్ గాయాలతో బాధపడుతుండగా స్టార్క్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి వైదొలిగాడు. కమిన్స్ జట్టుకు దూరం కావడంతో స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టులకు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కాగా, గతవారం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మార్కస్ స్టోయినిస్‌తోపాటు గాయంతో బాధపడుతున్న మిచెల్ మార్ష్ లేకుండానే చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ అడుగుపెట్టనుంది.
మార్క్ స్టోయినిస్ రిటైర్మెంట్‌తోపాటు గత నెల రోజులుగా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తుండటంతో జట్టులో అవసరమైన మార్పులు చేయాల్సి వచ్చినట్టు చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ తెలిపారు. అయితే, అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన తమ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించడానికి అసరమైన బలమైన పునాదిని కలిగి ఉందని చెప్పారు. ప్రత్యర్థిని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా జట్టును రూపొందించేందుకు అనేక ఆప్షన్లు ఉన్నట్టు తెలిపారు.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్క్ దూరం కావడం దెబ్బేనని బెయిలీ అంగీకరించారు. అయితే, అతడి స్థానంలో వస్తున్న ఆటగాడు టోర్నీలో తన ముద్ర వేయాలన్నారు. కాగా, శ్రీలంకతో నేటి నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా స్టార్క్ దూరమయ్యాడు.
కాగా, 8 దేశాలు తలపడే చాంపియన్స్ ట్రోపీ పాకిస్థాన్ వేదికగా జరుగుతుంది. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం యూఏఈలో జరుగుతాయి. ఈ నెల 19న టోర్నీ ప్రారంభమై మార్చి 9న ముగుస్తుంది.
ఆస్ట్రేలియా జట్టు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, బెన్ డ్వార్‌షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ప్రాసెర్ మెక్ గ్రక్, అరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడం జంపా.