Happy Sunday: ఏపీలో త్వరలో ‘హ్యాపీ సండే’: చంద్రబాబు

Chandrababu says will start Happy Sunday soon

  • మంత్రులు, కార్యదర్శులతో చంద్రబాబు వర్క్‌షాప్
  • ఈ నెలాఖరు నాటికి ఎవరి వద్దా పెండింగ్ ఫైళ్లు ఉండకూడదని ఆదేశాలు
  • గ్రీవెన్స్‌ ఎక్కువగా ఏ శాఖలో వస్తే ఆ విభాగం సరిగా పనిచేయనట్టేనన్న సీఎం
  • ఉగాది రోజున ‘పీ4’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్న చంద్రబాబు

ఈ నెలాఖరు నాటికి ఎవరి దగ్గరా పెండింగ్ ఫైళ్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఫైళ్లు ఆన్‌లైన్‌ విధానంలోకి వచ్చిన తర్వాత క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం పట్టకూడదన్నారు. మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చంద్రబాబు ముగింపు ప్రసంగం ఇస్తూ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆర్థికేతర ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. జీఎస్డీపీలో 15 శాతం వృద్ధి రేటు సాధించగలిగితేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమని, ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు. 

 గ్రీవెన్స్ ఏ శాఖలో, ఏ విభాగంలో ఎక్కువ వస్తే ఆ విభాగం సరిగా పని చేయనట్టే అర్థమని చంద్రబాబు పేర్కొన్నారు. రెవెన్యూ విభాగంలో అర్జీలు ఎక్కువ వస్తున్నాయని, దీనికి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే కారణమని విమర్శించారు. ప్రజల సంతృప్తి స్థాయిని అన్ని అవకాశాల ద్వారా పెంచాలని సూచించారు. వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా మనం పాలన సాగించాలని అన్నారు. ‘మిషన్ కర్మయోగి’ ద్వారా శిక్షణ ఇవ్వడం వల్ల పనితీరు మరింత పెరుగుతుందని, వాట్సాప్ గవర్నెన్స్‌లోనూ అందరూ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి అన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర విజన్ ప్రకారం ప్రతి శాఖ నిర్దిష్ఠ లక్ష్యంతో ముందుకెళ్లాలని చంద్రబాబు కోరారు. ప్రతి ఐఏఎస్ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేస్తామని సూచించారు. అధికారులందరూ గ్రామస్థాయికి వెళ్లి పర్యటించాలన్నారు. మార్చి లోపు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టుకోవచ్చో అన్నీ రాబట్టుకోవాలని, ఉగాది రోజున ‘పీ4’ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ‘హ్యాపీ సండే’ కూడా ప్రారంభిస్తామని, మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఇందుకోసం గైడ్‌లైన్స్ రూపొందించాలని ఆదేశించారు. మనం చేసే మంచి పనులతోనే సంతోషం కలుగుతుందని, కష్టపడి పని చేసినందువల్ల చాలా విభాగాల్లో ఫలితాలు కనబడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News