JP Nadda: జేపీ నడ్డాను కలిసిన ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు

- అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లతో బీజేపీ ఘన విజయం
- ముఖ్యమంత్రి రేసులో పలువురి పేర్లు
- నడ్డాను మర్యాదపూర్వకంగానే కలిశామన్న ఎమ్మెల్యేలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48, ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా బీజేపీలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తున్న సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలు నడ్డాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసినట్లు చెప్పారు. ఈ భేటీలో శాసనసభాపక్ష సమావేశం గురించి గానీ, ముఖ్యమంత్రి ఎంపిక అంశంపై గానీ చర్చ జరగలేదని తెలిపారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన అమెరికా పర్యటన ముగించుకొని భారత్ వస్తారు. ఆయన భారత్ తిరిగి వచ్చాక బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాసం ఉందని భావిస్తున్నారు.