Uttam Kumar Reddy: ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం
- స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ అన్న మంత్రి
- ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమన్నారు. ఈరోజు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసి పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని నేతలకు సూచించారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ అవుతాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు సులువవుతుందని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఈ ఏడాదిలో సాధించిన విజయాలను స్థానిక సంస్థల ఎన్నికల నాటికి విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఏడాది కాలంలో ఎన్నో పనులు చేసిందన్నారు. ఉపాధ్యాయ సహా పలు నియామకాలు చేపట్టినట్లు చెప్పారు.