KTR: జైల్లో పెడతామని బెదిరిస్తున్నా రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం: కేటీఆర్

KTR says brs is fighting with revanth reddy

  • పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
  • ముగ్గురు మంత్రులు కలిసి ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటోందన్న కేటీఆర్

ఏడాది కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా, విచారణల పేరిట పిలిచి జైల్లో పెడతామని బెదిరిస్తున్నా ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ఇక ముందు కూడా కొట్లాడతామన్నారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రల్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని అన్నారు. ఖమ్మం జిల్లాలో 2014 తర్వాత బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. పువ్వాడ అజయ్ వంటి నాయకులు ఓడిపోవడం బాధాకరమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటోందన్నారు. ఖమ్మంలో ఇటీవల వరదలు వస్తే అందరికీ పువ్వాడ అజయ్ గుర్తుకువచ్చాడన్నారు. వరదల సమయంలో జిల్లా మంత్రుల వల్ల పైసా ఉపయోగం కనిపించలేదని విమర్శించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడంతో ఎంతో నష్టపోయామనే అభిప్రాయంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. త్వరలో తాను ఖమ్మంలో పర్యటిస్తానని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News