Rohit Sharma: భారీ రికార్డు ముంగిట టీమిండియా కెప్టెన్‌.. మ‌రో 13 ర‌న్స్ చేస్తే చాలు..!

Rohit Sharma 13 Runs Away From Becoming 2nd Fastest Batter After Virat Kohli To Score 11000 Runs In ODIs

  • రేపు అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్‌ మూడో వ‌న్డే
  • మ‌రో 13 ర‌న్స్‌ చేస్తే వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ గా 11వేల ర‌న్స్ చేసిన రెండో ప్లేయ‌ర్ గా రోహిత్‌ రికార్డు
  • ఇప్ప‌టివ‌ర‌కు 259 ఇన్సింగ్స్ ల్లో 10,987 ప‌రుగులు చేసిన హిట్‌మ్యాన్‌

భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఓ భారీ రికార్డు ముంగిట ఉన్నాడు. మ‌రో 13 ప‌రుగులు చేస్తే వ‌న్డేల్లో అత్యంత వేగంగా 11 వేల ర‌న్స్ చేసిన రెండో ప్లేయ‌ర్ గా రికార్డుకెక్కుతాడు. క్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్‌, సౌర‌భ్ గంగూలీ, జాక్వెస్ క‌లిస్‌, రికీ పాంటింగ్ ల‌ను అధిగ‌మించి ఫాస్టెస్ట్ గా ఈ మార్క్ ను అందుకున్న ఆట‌గాడిగా హిట్‌మ్యాన్ చ‌రిత్ర సృష్టిస్తాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు రోహిత్ 259 ఇన్సింగ్స్ ల్లో 10,987 ప‌రుగులు చేశాడు. రేపు అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లండ్ తో జ‌రిగే మూడో వ‌న్డేలో ఈ రికార్డును అందుకునే అవ‌కాశం ఉంది. స‌చిన్ 259 ఇన్సింగ్స్ ల్లో ఈ మైలురాయిని అందుకోగా, పాంటింగ్ 286 ఇన్సింగ్స్ ల్లో సాధించాడు. 

సౌర‌భ్ గంగూలీ 288 ఇన్సింగ్స్ ల్లో ఈ ఫీట్ ను సాధిస్తే... జాక్వెస్ క‌లిస్ 293 ఇన్సింగ్స్ ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. కాగా, ఈ అరుదైన జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌ను కేవ‌లం 222 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఫీట్ ను న‌మోదు చేశాడు.  

ఇక ఇంగ్లండ్ తో జ‌రిగిన రెండో వ‌న్డేలో అద్భుత‌మైన సెంచ‌రీ (119)తో రోహిత్ ఫామ్‌లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇది వ‌న్డేల్లో అత‌నికి 32వ శ‌తకం కాగా... అంత‌ర్జాతీయ క్రికెట్ లో 49వ సెంచ‌రీ. హిట్‌మ్యాన్ మ‌రో శ‌త‌కం చేస్తే స‌చిన్ (100), కోహ్లీ (81) త‌ర్వాత 50 సెంచ‌రీలు చేసిన మూడో భార‌త క్రికెట‌ర్ గా రికార్డుకెక్కుతాడు.

కాగా, గ‌త కొంత‌కాలంగా ఫామ్‌లేక ఇబ్బంది ప‌డ్డ హిట్‌మ్యాన్ కు ఇంగ్లండ్ పై శ‌త‌కం భారీ ఉప‌శ‌మ‌నం అని చెప్పాలి. అందులోనూ త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న కీల‌క‌మైన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ తిరిగి గాడిలో ప‌డ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు.  

ఇక భార‌త్‌, ఇంగ్లండ్ మూడు వ‌న్డేల సిరీస్ విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టికే రెండు మ్యాచ్ లు జ‌ర‌గ‌గా, ఈ రెండింటిలోనూ ఆతిథ్య భార‌తే గెలిచింది. 2-0తో సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకుంది. దాంతో రేపు (బుధ‌వారం) అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే మూడో వ‌న్డే నామమాత్రంగా మారింది. అయితే, ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ చూస్తూంటే.. ఆఖ‌రి మ్యాచ్ లోనైనా గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని ఇంగ్లీష్ జ‌ట్టు భావిస్తోంది.   

  • Loading...

More Telugu News