Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచారు, సోదరుడిగా నేనూ అండగా నిలుస్తా!: మంద కృష్ణ మాదిగ

- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంద కృష్ణ మాదిగ భేటీ
- రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తానని సీఎం చెప్పారన్న మంద కృష్ణ
- ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ సందర్భాల్లో ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా తానూ అండగా ఉంటానన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి భాగస్వామ్యమయ్యారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారన్నారు.
మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక సిఫార్సులపై, ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై చర్చించారు.
అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా తమ పోరాటం కొనసాగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేసేలా జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదించారని ఆయన అన్నారు. రిజర్వేషన్ శాతం విషయంలో మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కులాల చేర్పులు, మార్పుల్లో లోటుపాట్లపై వినతిపత్రం అందించినట్లు మంద కృష్ణ మాదిగ తెలిపారు. తాము మొదటి నుండి ఏబీసీడీ వర్గీకరణ కోసమే పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణను 4 గ్రూపులుగా చేయాలని కోరినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీ గ్రూపులో ఉన్న వర్గాన్ని మొదటి గ్రూపులో చేర్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణలోని లోటుపాట్లను ముఖ్యమంత్రి సరిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.