YouTube: కేంద్రం నోటీసుల నేపథ్యంలో ఆ వీడియోను తొలగించిన యూట్యూబ్

YouTube removes Ranveer Allahbadia controversial episode
  • వివాదాస్పదమైన రణ్‌వీర్ ఇలహాబాదియా వీడియో
  • యూట్యూబ్‌కు సమాచార, మంత్రిత్వశాఖ నోటీసులు
  • పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతానన్న శివసేన (యూబీటీ) ఎంపీ
ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో యూట్యూబర్ రణ్‌వీర్ ఇలహాబాదియాకు చెందిన వివాదాస్పద వీడియోను యూట్యూబ్ తొలగించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి యూట్యూబ్‌కు నోటీసులు అందాయి. ఈ క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోను యూట్యూబ్ తొలగించింది.

సదరు వీడియోలో తల్లిదండ్రుల శృంగారంపై రణ్‌వీర్ ఇలహాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రణ్‌వీర్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పలువురు నాయకులు అతనిపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు.

పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతా: ప్రియాంక చతుర్వేది

రణ్‌వీర్ అంశాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తుతానని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. కామెడీ కంటెంట్ పేరుతో భాషా పరిమితులు దాటడం సరికాదన్నారు. ఒక వేదికపై మీకు అవకాశం లభించినంత మాత్రాన ఏదైనా మాట్లాడవచ్చని కాదన్నారు.

రణ్‌వీర్‌కు ఎంతోమంది ఫాలోవర్లు ఉన్నారని, అనేకమంది రాజకీయ నాయకులు అతని పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఈ అంశాన్ని పార్లమెంట్‌‌లో లేవనెత్తుతానని  ఆమె స్పష్టం చేశారు.
YouTube
BJP
Central Government

More Telugu News