Gali Jagadish: వైసీపీలోకి గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండో కొడుకు... రోజాకు చెక్?

- జగన్ సమక్షంలో రేపు వైసీపీలో చేరనున్న గాలి జగదీశ్
- రోజాకు సమాచారం ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం
- టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ సోదరుడే జగదీశ్
ఇప్పటి వరకు వైసీపీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరారు. తాజాగా వైసీపీలోకి కొత్త చేరికలు మొదలయ్యాయి. ఇటీవలే కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా మరోనేత వైసీపీలో చేరబోతున్నారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కొడుకు, నగరి నేత గాలి జగదీశ్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
జగదీశ్ చేరికపై మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజాకు సమాచారం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. నగరి నియోజకవర్గానికి రోజాను దూరం పెట్టాలనే యోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం వైసీపీ శ్రేణుల్లో ఊపందుకుంది. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా రోజాకు వైరం ఉన్న సంగతి తెలిసిందే. నగరి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ సోదరుడే గాలి జగదీశ్ కావడం గమనార్హం. జగదీశ్ మామ కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.