Kim Jong Un: మమ్మల్ని కవ్విస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది.. అమెరికాకు కిమ్ వార్నింగ్

Kim Jong Un Serious Warning To America

  • సౌత్ కొరియా జలాల్లో అమెరికా సబ్ మెరైన్ నిలపడంపై ఆగ్రహం
  • కొరియా ద్వీపకల్పంలో సైనిక ఘర్షణ జరగొచ్చంటూ హెచ్చరిక
  • నార్త్ కొరియా సమీపంలో ఇటీవల అమెరికా, సౌత్ కొరియా నౌకల యుద్ధ విన్యాసాలు

ఉత్తర కొరియా భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తేల్చిచెప్పారు. అమెరికా తీరుపై తీవ్రంగా మండిపడుతూ.. తమను కవ్విస్తే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమ భూభాగానికి సమీపంలో యుద్ధ విన్యాసాలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరియా ద్వీపకల్పంలో సైనిక ఘర్షణకు దారితీసేలా ప్రవర్తిస్తున్నారంటూ అమెరికా, దక్షిణ కొరియాలపై ఆరోపణలు గుప్పించారు. ఇటీవల ఆ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించిన యుద్ద విన్యాసాలను కిమ్ తప్పుబట్టారు. తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ నౌకాశ్రయంలో అమెరికా సబ్ మెరైన్ నిలపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా తన బలాన్ని గుడ్డిగా నమ్ముకుంటోందని, ఉత్తర కొరియా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికా ఉన్మాదానికి తాజా పరిస్థితి అద్దం పడుతోందని, ఈ కవ్వింపు చర్యలతో తాము ఆందోళన చెందుతున్నామని ఉత్తర కొరియా రక్షణ శాఖ పేర్కొంది. అమెరికా తీరు వల్ల సైనిక ఘర్షణ తప్పకపోవచ్చని, కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించేందుకు తమకున్న హక్కులను వాడుకుంటామని తెలిపింది. ఉత్తర కొరియా చేసిన ఈ హెచ్చరికలపై ఇటు దక్షిణ కొరియా కానీ అటు అమెరికా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 

బుసాన్ పోర్టులో అమెరికా అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపిన విషయం నిజమేనని దక్షిణ కొరియా అంగీకరించింది. సిబ్బందికి నిత్యావసరాలను అందించేందుకే యూఎస్‌ఎస్‌ అలెగ్జాండ్రియా జలాంతర్గామిని పోర్టులోకి అనుమతించినట్లు వివరించింది. సమాచార మార్పిడి కోసమే సబ్ మెరైన్ బుసాన్ పోర్టుకు వచ్చిందన్న ఉత్తర కొరియా ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా, అమెరికా నేవీలో యూఎస్ఎస్ అలెగ్జాండ్రియా కీలకమైనదని ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Kim Jong Un
North Korea
America
Submarine
South Korea
  • Loading...

More Telugu News