Sankranthiki Vasthunam: జీ ఇచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విస్ట్‌తో అందరికి అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి..!

Wow everyone remembers those days with the twist of Sankranthiki Vasthunam

  • ఓటీటీలో కంటే ముందుగానే టెలివిజన్‌లో ప్రసారం కానున్న 'సంక్రాంతికి వస్తున్నాం' 
  • ఓటీటీల ట్రెండ్‌లో జీ సంస్థ కొత్త ప్రయోగం
  • టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం జీ తెలుగు మార్కెటింగ్‌ స్ట్రాటజీ 

మనకు టెలివిజన్ అందుబాటులోకి వచ్చినప్పుడు దూరదర్శన్‌లో వారానికి ఓసారి వచ్చే 'చిత్రలహరి' కోసం, నెలలో ఓసారి వచ్చే తెలుగు సినిమా కోసం ఎంతగా ఎదురు చూశామో 80వ దశకంలో పుట్టి పెరిగిన అందరికీ గుర్తుండే ఉంటుంది. మన ఇంట్లో టీవీ లేకపోయినా, ఎదురింట్లో దూరిపోయి ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఆ సినిమా చూసిన రోజులు ఎవరికైనా మధుర జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఇక కాలక్రమేణా టెక్నాలజీ పెరిగిపోయి కలర్ టీవీలు, శాటిలైట్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్, లోకల్ కేబుల్స్ అందుబాటులోకి రావడంతో ఎంటర్టైన్మెంట్‌కు కొదువ లేకుండా పోయింది.

ముఖ్యంగా శాటిలైట్ ఛానెల్స్‌లో సినిమాలు థియేటర్లలో విడుదలైన మూడు నెలల నుండి ఆరు నెలల లోపు ప్రసారం కావడం చూశాం. అంతేకాదు సినిమా శాటిలైట్ హక్కుల కోసం ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఛానెల్స్ పోటీపడి మరీ కొనుక్కునేవారు. ఇక కరోనా పుణ్యమా అని ఓటీటీలు ఎప్పుడైతే వచ్చాయో ఇక కొత్త సినిమాల కేరాఫ్ అడ్రస్ ఓటీటీగా మారిపోయింది. కరోనా సమయంలో కొన్ని సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కరోనా భయం పోయిన తరువాత మళ్ళీ థియేటర్స్ పూర్వ వైభవం రావడంతో థియేటర్స్‌లో రిలీజైన నెలలోపే సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

ఇంకేముంది, సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ఇంట్లో ఇంటర్నెట్ కూడా కనీస అవసరంలా మారడంతో అందరూ ఇంట్లో ఓటీటీలో సినిమాలు చూడడానికి అలవాటయ్యారు. శాటిలైట్ ఛానెల్స్‌లో కొత్త సినిమా కోసం ఎదురుచూసే రోజులు పోయాయి. అందుకే శాటిలైట్ హక్కుల ధరలు కూడా ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా తగ్గిపోయాయి. అయితే ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చే విధంగా మొదటగా ఈ చిత్రాన్ని ఓటీటీలో కంటే ముందు జీ తెలుగు శాటిలైట్ ఛానెల్‌లో ప్రసారం చేస్తుందనే వార్త అందరిలోనూ ఆనందాన్ని నింపింది.

'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఓటీటీ, డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది. అయితే అందరూ మొదట ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతుందని భావించారు. అయితే జీ సంస్థ మాత్రం ఈ సినిమా మొదటగా తమ జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాబోతుందని సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ ట్విస్ట్ ఇచ్చి, ఆ పాత రోజులని గుర్తు చేసింది. సోమవారం తన సోషల్ మీడియా అకౌంట్‌లో జీ తెలుగు సంస్థ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను పోస్ట్ చేసింది.

"మళ్ళీ సంక్రాంతి వైబ్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి" ఓటీటీ కంటే ముందుగా టీవీలో అంటూ ఈ పోస్ట్‌కు హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. దీంతో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం మొదట టెలివిజన్ ప్రీమియర్‌గా అందర్నీ అలరించడానికి రెడీ అవుతోంది. అయితే ఓటీటీ కన్నా ముందుగా టీవీలో ప్రసారం చేయడానికి వెనుక జీ తెలుగు మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉందని తెలిసింది. 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాను ముందు టీవీలో ప్రసారం చేస్తే టీఆర్‌పీ రేటింగ్స్ బాగుంటాయని జీ తెలుగు ఆలోచనలా ఉంది. ఏది ఏమైనా జీ తెలుగు ఇచ్చిన ట్విస్ట్‌తో అందరూ ఖుషీ అవుతూ ఆ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News