Allu aravind: 'తండేల్' పైరసీదారులకు అల్లు అరవింద్ హెచ్చరికలు

- తండేల్ చిత్రం పైరసీ విడుదలపై నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆగ్రహం
- మీడియా సమావేశంలో పైరసీ దారులకు హెచ్చరిక
- సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకువెళ్లి వాళ్లను అరెస్టు చేయిస్తామన్న అల్లు అరవింద్
'తండేల్' చిత్రాన్ని పైరసీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు హెచ్చరించారు. ఇటీవల ఓ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఆ పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణమని, చిత్ర విజయాన్ని ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయిందని అల్లు అరవింద్, బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ, కొందరు తెలిసి, మరి కొందరు తెలియక ఇలా సినిమాలను పైరసీ చేస్తున్నారని, వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపులలో ఆ లింక్స్ ను ఫార్వర్డ్ చేస్తున్నారని, అలా పైరసీ చేస్తున్న వారిని, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నామని, వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఫిల్మ్ ఛాంబర్ చర్యల వల్ల కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ జరగడం లేదని, అయితే రెండు నెలల నుంచి మళ్లీ ఈ రాక్షసి విరుచుకుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'గేమ్‌ఛేంజర్'ను ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారన్నారు. చాలా ప్రయత్నాలు చేసి లింక్‌లు తొలగించినట్లుగా వివరించారు. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పని చేస్తుంటారని అల్లు అరవింద్ చెప్పారు. సోషల్ మీడియాలో పెట్టిన వారు, ఫార్వర్డ్ చేస్తున్నవారి సమాచారాన్ని సైబర్ క్రైమ్ విభాగం దృష్టికి తీసుకెళ్లామని, వారందరినీ అరెస్టు చేయిస్తామని తెలిపారు.
నాగచైతన్య – సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రమే 'తండేల్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు.