sankranthiki vasthunam: సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టీవీలో ముందా, ఓటీటీలో ముందా?... క్లారిటీ ఇచ్చిన జీ5

sankranthiki vasthunam coming soon on zee telugu

  • ఓటీటీ కంటే ముందే టెలివిజన్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ
  • కీలక ప్రకటన చేసిన జీ తెలుగు
  • ‘మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను అస్వాదించడానికి సిద్దంగా ఉండండి’ అంటూ జీ తెలుగు పోస్టు

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా (గ్రాస్) వసూళ్లు సాధించింది. సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇంకా చాలా థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగానే ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ 5 ఒక ప్రకటన చేసింది. ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ హక్కులను జీ 5/ జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ మేరకు జీ తెలుగు సోమవారం తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 'మళ్లీ సంక్రాంతి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్ చేసింది. ఓటీటీ కంటే ముందే టీవీలో అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసింది.

దీంతో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం మొదట టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల రెండో వారంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. అయితే సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో ఓటీటీ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

More Telugu News