TDP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ ఫిర్యాదుదారుడి అఫిడవిట్

Big twist in Gannavaram TDP office attack case

  • గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
  • టీడీపీ కార్యాలయంలోని ఆపరేటర్ ఫిర్యాదుతో కేసు నమోదు
  • పోలీసులు తనతో బలవంతంగా సంతకం తీసుకున్నారంటూ అఫిడవిట్ దాఖలు చేసిన ఆపరేటర్
  • విచారణ నేటికి వాయిదా

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని పేర్కొంటూ నిన్న కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. 

టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు ఆధారంగానే గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. 45 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బెయిలు కోసం కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, బెయిలు కోసం కింది కోర్టునే ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వారు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ ప్రారంభమైంది. 

ఈ క్రమంలో ఈ కేసు ఫిర్యాదుదారుడైన సత్యవర్థన్.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని న్యాయాధికారి హిమబిందుకు వివరిస్తూ తన వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసి తీసుకొచ్చిన సీడీతోపాటు అఫిడవిట్ అందజేశారు. ఈ కేసులో పోలీసులు తనను సాక్షిగా పిలిచి సంతకం తీసుకున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో విచారణను కోర్టు నేటికి (మంగళవారం) వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News