Indian Railways: భారతీయ రైల్వేకి ఇక న్యూక్లియర్ పవర్!

- అణు విద్యుత్ ను స్వచ్చమైన ఇంధన వనరుగా పేర్కొన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- భారత రైల్వేలో అణు విద్యుత్ వినియోగంపై రాజ్యసభలో టీఎంసీ సభ్యుడు సాగరికా ఘోష్ ప్రశ్న
- లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర రైల్వే మంత్రి
భారతీయ రైల్వేకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల నేపథ్యంలో శిలాజ ఇంధనం వినియోగాన్ని తగ్గించి అణు విద్యుత్ వినియోగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సాగరికా ఘోష్ రాజ్యసభలో లేవనెత్తిన సమస్యపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం అందుకు ఊతం ఇస్తోంది.
అణు విద్యుత్ వినియోగించేలా రైల్వే అభివృద్ధి చేస్తుందా? ఇందులో పురోగతి సాగించిందా? అని టీఎంసీ ఎంపీ సాగరిక రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రైల్వేకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల కోసం అణు విద్యుత్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విద్యుత్ మంత్రిత్వ శాఖలను సంప్రదించామని వివరించారు.
అయితే, అణు విద్యుత్ వినియోగం వల్ల వచ్చే సమస్యలు, పర్యావరణంపై దీని ప్రభావంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అణు విద్యుత్ ను స్వచ్చమైన ఇంధన వనరుగా ఆయన పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందని, తద్వారా కర్బన ఉద్గారాలు తగ్గుతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.