Chiranjeevi: అటు చిరంజీవి... ఇటు అల్లు అరవింద్‌ ఇద్దరూ అభిమానులను ఖుషీ చేశారు!

Both Chiranjeevi and Allu Aravind made the fans happy

  • లైలా' వేడుకలో పుష్ప సక్సెస్‌ గురించి కామెంట్స్‌ చేసిన చిరు 
  • తన వ్యాఖ్యాలకు నొచ్చుకున్న మెగా అభిమానులకు సారీ చెప్పిన అల్లు అరవింద్‌ 
  • ఈ ఇద్దరి మాటలతో ఖుషీ అవుతున్న అభిమానులు 
  • ఇక మెగా కుటుంబం, అల్లు కుటుంబం ఒక్కటే అంటూ సంతోషపడుతున్న అభిమానులు

గత కొంతకాలంగా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య దూరం పెరిగిందనే వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్‌కు మద్దతుగా నిలవడం ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి కారణమైందని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి మెగా అభిమానులు, అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వివాదాస్పద చర్చలు జరుగుతున్నాయి.

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు కావడం, ఆపై ఆయనను ఒకరోజు అరెస్టు చేయడం వంటి పరిస్థితుల్లో చిరంజీవి స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి వచ్చారు. అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోందనే ప్రచారం మాత్రం ఆగలేదు. 'పుష్ప-2' విడుదలై అఖండ విజయం సాధించి, దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించినా మెగా కుటుంబం నుంచి ఆ సినిమాకు ప్రశంసలు రాకపోవడం గమనార్హం.

అయితే ఇటీవల జరిగిన 'లైలా' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి తన ప్రసంగంలో మెగా హీరోల గురించి ప్రస్తావిస్తూ "పుష్ప-2 బ్లాక్‌బస్టర్ విజయం పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని" చెప్పడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకునే మెగా అభిమానులు కూడా ఈ విషయం పట్ల సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉండగా అల్లు అరవింద్ గతంలో 'గేమ్ ఛేంజర్' చిత్రంపై చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇచ్చారు.

సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ "ఇది చాలా ఎమోషనల్ విషయం. ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్‌లో నేను 'దిల్' రాజును ఆహ్వానించేటప్పుడు రామ్ చరణ్‌ను తక్కువ చేశానని మెగా అభిమానులు నాపై ట్రోల్స్ చేశారు. దానిపై ఓ సీనియర్ విలేకరి ప్రశ్నిస్తే ఈ సందర్భం కరెక్ట్ కాదని సమాధానం దాటవేశాను. అయితే ఇప్పుడు దాని గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు నేను దిల్ రాజును ఆహ్వానిస్తూ.. ఒక వారంలోనే కష్టాలు, నష్టాలు, ఇన్‌కమ్ టాక్స్ ఇలా అన్ని అనుభవించాడని చెప్పే క్రమంలో నాకు తెలియకుండానే ఒక పదాన్ని వాడాను. దీనికి మెగా అభిమానులు బాధపడ్డారు. నన్ను ట్రోల్స్ చేశారు. రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వాడు. నా ఏకైక మేనల్లుడు. చరణ్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. పొరపాటున ఆ పదం వాడాను. అలా వాడి ఉండకూడదు. దిల్ రాజు జీవితంలోని కష్టాలను చెప్పడానికి ఆ పదాలు వాడాను అంతే. ఒకవేళ మెగా అభిమానులు నొచ్చుకుంటే నేను వారికి సారీ చెబుతున్నాను" అన్నారు. ఒకే రోజు తేడాలో చిరంజీవి పుష్ప గురించి మాట్లాడి అల్లు అర్జున్ అభిమానులతో పాటు మెగా అభిమానులను సంతోషపరిస్తే, అల్లు అరవింద్ మెగా అభిమానులు బాధపడుతున్న అంశానికి వివరణతో పాటు క్షమాపణ చెప్పి మెగా అభిమానులను ఖుషీ చేశారు. 

  • Loading...

More Telugu News