Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక... రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం

- గనులు, ఖనిజాభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష
- వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచన
- ఇసుకను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి
రాష్ట్రంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు ఆయన గనులు ఖనిజాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రవాణా, తవ్వకాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద తనిఖీలు చేపట్టాలని, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి అన్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా కట్టడి బాధ్యతలను కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించాలన్నారు.
ఆ బాధ్యత హైడ్రాకు ఇవ్వాలి
హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణా కట్టడి బాధ్యతను హైడ్రాకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ఇసుక రీచ్‌ల వద్ద కెమెరాలు, సోలార్ లైట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇసుక కోసం బుక్ చేసిన 48 గంటల్లోపు వినియోగదారుడికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.