Rangarajan: రంగరాజన్ మీద దాడి ఘటనపై పోలీసుల కీలక ప్రకటన

- ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి
- రంగరాజన్‌ను ఆర్థిక సాయం కోరిన వీరరాఘవరెడ్డి
- నిరాకరించడంతో దాడి చేసినట్లు తెలిపిన డీసీపీ
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. తమకు ఆర్థిక సాయం చేయాలని, తాము స్థాపించిన రామరాజ్యంలో సభ్యులను చేర్చాలని వీరరాఘవరెడ్డి డిమాండ్ చేశారని, అందుకు రంగరాజన్ నిరాకరించాడని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో దాడి జరిగిందన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఉదయం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారని వెల్లడించారు. సాయంత్రం వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యంను స్థాపించాడని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేసుకున్నట్లు చెప్పారు. రామరాజ్యంలో చేరిన వారికి రూ.20 వేలు ఇస్తానని ప్రకటించారని... రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫాం కుట్టించుకోమని చెప్పారని డీసీపీ వెల్లడించారు. రామరాజ్యం బ్యానర్‌తో ఫొటోలు, వీడియోలు తీసి ప్రచారం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ నెల 7వ తేదీన వాహనాల్లో మరో 25 మందితో కలిసి వీరరాఘవరెడ్డి చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ వద్దకు వచ్చి ఆర్థిక సాయం అడిగి, ఆ తర్వాత దాడి చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రస్తుతం మణికొండలో ఉంటున్న వీరరాఘవరెడ్డిది తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామమని డీసీపీ తెలిపారు.