KTR: రేవంత్ రెడ్డి వారి కోసమే పనిచేస్తున్నారు: కేటీఆర్

- అనుముల సోదరుల కోసం, అదానీ కోసం పని చేస్తున్నారని విమర్శ
- ఏడాదిగా కౌరవ పాలన సాగుతోందన్న కేటీఆర్
- కొడంగల్ రైతు దీక్షలో కేటీఆర్ విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదని... అనుముల అన్నదమ్ముల కోసం, అదానీల కోసం పని చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన సాగుతోందని విమర్శించారు. కొడంగల్‌లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారని, కానీ అది జరగలేదన్నారు. రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా? అని నిలదీశారు.