Harish Rao: రేవంత్ రెడ్డికి ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదు: హరీశ్ రావు

- రేవంత్ రెడ్డి అక్టోబర్ నుండి 11సార్లు ఢిల్లీకి వెళ్లారన్న హరీశ్ రావు
- రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదా? అని అడిగితే ఫోన్ చూపించారని ఎద్దేవా
- ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యల ధర్నాకు హరీశ్ రావు మద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 11 సార్లు ఢిల్లీకి వెళ్లారని, కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నారో ఢిల్లీ పెద్దలకు అర్థమైందన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకక ఆయన వెళుతున్నారు, వస్తున్నారని ఎద్దేవా చేశారు.
"మీకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదట సర్" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించారని వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు, నాతో మాట్లాడారు చూడండంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ తీసి చూపించారని, అలా ఫోన్ తీసి చూపించారంటే ఆయన పరువు పోయినట్లే అన్నారు.
హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు ధర్నాకు దిగారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. తమకు శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.
ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ, ఆర్ఎంపీ, పీఎంపీలపై వేధింపులు ఆపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంపీలను భయపెడుతోందని ఆరోపించారు. వారిపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.