Saif Ali Khan: దాడి ఘటనపై తొలిసారి స్పందించిన సైఫ్.. కొడుకు మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగం!

- జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో ఆయనపై దుండగుడి దాడి
- తీవ్రంగా గాయపడ్డ నటుడికి ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స
- ప్రస్తుతం కోలుకుంటున్న నటుడు
- రక్తంతో తడిచిన తన కుర్తాను చూసి కొడుకు తైమూర్ ఏమన్నాడో గుర్తు చేసిన సైఫ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న జరిగిన దాడి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. బాంద్రాలోని ఆయన నివాసంలో దొంగతనానికి వచ్చిన దుండగుడు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సైఫ్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను కుటుంబ సభ్యులు ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం సైఫ్ కోలుకుంటున్నారు. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదిలాఉంటే... తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ తొలిసారి తనపై జరిగిన దాడి విషయమై స్పందించారు. దుండగుడి దాడి తర్వాత తాను ధరించిన కుర్తా మొత్తం రక్తమయమైనట్లు తెలిపారు. దాంతో తన భార్య కరీనా తనను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆటో లేదా క్యాబ్ కోసం ప్రయత్నిస్తోంది.
అయితే, రక్తంతో తడిచిన తనను చూసిన కుమారుడు తైమూర్ తన దగ్గరికి వచ్చి నాన్న నువ్వు చనిపోతున్నావా అని అడిగినట్లు సైఫ్ తెలిపారు. దాంతో లేదు అలాంటిది ఏమీ జరగదు అని కొడుకుతో చెప్పారట. ఆ తర్వాత తైమూర్ తనతో కలిసి ఆసుపత్రికి రావడంతో తాను ఒంటరిగా లేను అనే భావన కలిగించిందంటూ సైఫ్ భావోద్వేగానికి లోనయ్యారు.