Ram Lakshman: అవకాశాలు రాకనే కాదు, అహంకారం వచ్చి కూడా ఇబ్బంది పడ్డాం: రామ్ లక్ష్మణ్!

- మారుమూల గ్రామంలో పుట్టిపెరిగామన్న రామ్ లక్ష్మణ్
- గుండ్రాళ్లు ఎత్తిన తరువాత హీరోలుగా చూశారని వ్యాఖ్య
- అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డామని వెల్లడి
- 'అలజడి' సినిమాతో తమ ప్రయాణం మొదలైందని వివరణ
టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్లుగా రామ్ - లక్ష్మణ్ లకు మంచి పేరు ఉంది. సుదీర్ఘమైన తమ కెరియర్ లో వాళ్లు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు పని చేశారు. అలాంటి రామ్ లక్ష్మణ్ లు తాజాగా తమ్మారెడ్డి భరద్వాజాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. "మాది ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. అక్కడే పుట్టి పెరిగాము. పెద్దగా చదువుకోలేదు .. కానీ జీవితంలో ఎదగాలనే ఒక కసి ఉండేది" అని అన్నారు.
" మా నాన్నకి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. జూదం .. తాగడం .. కోడి పందాలు .. ఇలా ఆయనకి లేని అలవాటు లేదు. కుటుంబం పట్ల ఆయన బాధ్యత లేకుండా ఉండేవాడు. అందువలన మేము ఎక్కువగా మా నాయనమ్మ దగ్గర పెరిగాము. జీవితం పట్ల మాకు ఒక అవగాహన రావడానికి కారణం ఆమెనే. మా ఊళ్లో రెండు పెద్ద పెద్ద గుండ్రాళ్లు ఉన్నాయి. వాటిని పైకి ఎత్తిన తరువాత నుంచి అందరూ హీరోలుగా చూడటం మొదలుపెట్టారు. ఒక రకంగా మేము ఇండస్ట్రీకి రావడానికి కారణం కూడా మా నాన్ననే అని చెప్పాలి. రాజు మాస్టర్ ను నమ్ముకుని 1986లో చెన్నై కి వెళ్లాము" అని చెప్పారు.
" 1989లో భానుచందర్ సినిమా 'అలజడి'తో మీరే మాకు అవకాశం ఇచ్చారు. అలా ఫైట్ మాస్టార్లుగా మా ప్రయాణం మొదలైంది. ఆరంభంలో అవకాశాలు రాక ఇబ్బందులు పడ్డాము. ఆ తరువాత అహంకారం రావడం వలన ఇబ్బందులు పడ్డాము. గోళ్లు పెరిగితే ఎలా కట్ చేస్తామో .. జుట్టు పెరిగితే ఎలా కట్ చేస్తామో .. అలాగే అహంకారాన్ని కూడా గమనించుకుంటూ ఎప్పటికప్పుడు కట్ చేయాలనే విషయం మాకు అర్థమైంది. ఆ తరువాత నుంచి మా ప్రయాణం సాఫీగానే సాగుతూ వచ్చింది" అని అన్నారు.