Thandel: 'తండేల్' పైరసీ.. ఆర్‌టీసీకి నిర్మాత బన్నీ వాసు విజ్ఞప్తి

- నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో వచ్చిన 'తండేల్' మూవీ
- ఈ నెల 7న విడుదలైన సినిమాకు మొదటి రోజు నుంచే పట్టుకున్న పైరసీ భూతం
- తాజాగా మూవీ పైరసీ వెర్షన్ ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులో ప్రదర్శన
- చర్యలు తీసుకోవాలంటూ సంస్థ ఛైర్మన్‌కు నిర్మాత విజ్ఞప్తి
ఈ నెల 7న విడుదలైన 'తండేల్' మూవీని మొదటి రోజు నుంచే పైరసీ భూతం పట్టుకున్న విషయం తెలిసిందే. రిలీజైన ఫస్ట్‌డేనే సినిమా పైరసీ చేసి, నెట్టింట పెట్టేశారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఈ మూవీ పైరసీ వెర్షన్ ను ఏపీఎస్ఆర్‌టీసీకి చెందిన బస్సులో ప్రదర్శించడంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
"ఓ మీడియా సంస్థలో వచ్చిన న్యూస్ ద్వారా ఏపీఎస్ఆర్‌టీసీకి చెందిన బస్సులో తండేల్ పైరసీ వెర్షన్ ను ప్రదర్శించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇది చట్టవిరుద్ధం, అన్యాయం. సినిమా కోసం రేయింబవళ్లు అవిశ్రాంతంగా కష్టపడిన ఎంతోమందిని అవమానించడం కూడా. ఒక మూవీ ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టుల కల" అని బన్నీవాసు పేర్కొన్నారు.
ఇలాంటివి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును నిర్మాత కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇక నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' మూవీ హిట్ టాక్ సొంతం చేకున్న విషయం తెలిసిందే. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే, ఈ సినిమాను కొందరు పైరసీ చేసి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేశారు. ఇటీవల ఓ లోకల్ ఛానల్ లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇటీవల ఓ మీడియా సమావేశంలో నిర్మాత బన్నీ వాసు స్పందించారు.