25 lakhs: బస్సులో నుంచి రూ.25 లక్షల చోరీ.. వీడియో ఇదిగో!

Bag Containing Rs 23 Lakhs Stolen From A Bus

  • నల్గొండ జిల్లా గోపలాయపల్లి శివార్లలోని ఓ హోటల్ ముందు ఘటన
  • టిఫిన్ చేసి వచ్చేలోపు క్యాష్ బ్యాగ్ మాయమైందని బాధితుడి ఆవేదన
  • సీసీ కెమెరాలో నిక్షిప్తమైన చోరీ ఘటన

చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ బస్సులో దొంగతనం జరిగింది. హోటల్ ముందు నిలిపిన బస్సులో నుంచి రూ.25 లక్షల క్యాష్ బ్యాగ్ మాయమైంది. టిఫిన్ తిని వచ్చే లోపు క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లారంటూ బాధిత ప్రయాణికుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నల్గొండ జిల్లా నార్కాట్ పల్లి మండలంలోని గోపలాయపల్లి శివార్లలో ఆదివారం ఉదయం చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన వెంకటేశ్వర్లు చెన్నై నుంచి హైదరాబాద్ కు బస్సులో బయలుదేరాడు. రూ.25 లక్షల క్యాష్ బ్యాగ్ తో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాడు.

ఆదివారం ఉదయం గోపలాయపల్లి శివార్లలో ప్రయాణికులు టిఫిన్ చేయడం కోసం డ్రైవర్ బస్సును ఓ హోటల్ ముందు నిలిపాడు. క్యాష్ బ్యాగ్ ను బస్సులోనే పెట్టి వెంకటేశ్వర్లు హోటల్ లోకి వెళ్లి టిఫిన్ చేసి వచ్చాడు. తిరిగి వచ్చే సరికి సీటులో పెట్టిన క్యాష్ బ్యాగ్ మాయమైంది. దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు తోటి ప్రయాణికులకు, బస్సు డ్రైవర్ కు విషయం వివరించాడు. ప్రయాణికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరకున్న పోలీసులు హోటల్ ముందున్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి భుజాన క్యాష్ బ్యాగ్ తో బస్సు దిగి వెళ్లిపోవడం కనిపించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News