punjab man: అక్రమ మార్గంలో అమెరికా వెళుతూ మార్గమధ్యంలో పంజాబీ యువకుడి మృతి

- ఏజెంట్ సాయంతో అక్రమ మార్గంలో అమెరికాకు బయలుదేరిన పంజాబీ యువకుడు
- గ్వాటెమాలాలో గుండె పోటుతో గురుప్రీత్ సింగ్ మృతి
- మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన పంజాబ్ మంత్రి కుల్దీప్ సింగ్ దలివాల్
- డంకీ రూట్‌లో వెళ్లడం సరికాదన్న మంత్రి
అక్రమ మార్గంలో అమెరికాకు బయలుదేరిన ఓ పంజాబీ యువకుడు గ్వాటెమాలాలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఓ పక్క అక్రమంగా తమ దేశానికి వచ్చిన వాళ్లను అమెరికా బలవంతంగా తిప్పి పంపుతున్న తరుణంలో అక్రమ మార్గం (డంకీ రూట్)లో ఓ యువకుడు అమెరికా వెళ్లే సాహసం చేసి మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మృతి చెందగా, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు.
గురుప్రీత్ సింగ్ సోదరుడైన తారా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు అమెరికా వెళ్లేందుకు మూడు నెలల క్రితం ఇంటి నుంచి బయలుదేరాడని, ఇందు కోసం చండీగఢ్ లోని ఏజెంట్ బల్వీందర్ సింగ్‌ను సంప్రదించాడని తెలిపారు. అతను 16.5 లక్షలు తీసుకుని తన సోదరుడిని గయానా పంపి అక్కడ ఓ పాకిస్థానీ ఏజెంట్‌కు అప్పగించాడని చెప్పారు.
అనంతరం అక్కడి నుంచి మరి కొందరు వలసదారులతో కలిసి పనామా అడవి గుండా కొలంబియాకు తన సోదరుడు బయలుదేరాడని, మధ్యలో ఓ సారి గ్వాటెమాలాలోని ఓ హోటల్ నుంచి ఫోన్ చేసి గరుప్రీత్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమకు చెప్పారని, ఆ తర్వాత కొద్దిసేపటికే చనిపోయినట్లు సమాచారం ఇచ్చారన్నారు. తన సోదరుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, మృతుడి కుటుంబాన్ని పంజాబ్ రాష్ట్ర మంత్రి కుల్దీప్ సింగ్ దలివాల్ పరామర్శించారు. అతని మరణం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఏ దేశానికైనా అక్రమ మార్గంలో వెళ్లొద్దని, చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకొని వెళ్లాలని సూచించారు. డంకీ రూట్ లో వెళ్లడం సరికాదని హితవు పలికారు.