Rohit Sharma: అతడిని ఎక్కువ రోజులు సైలెంట్‌గా ఉంచలేరు.. రోహిత్‌పై సూర్య, పాండ్యా, యువీ ప్రశంసలు!

- కటక్ వన్డేలో సెంచరీతో అదరగొట్టిన హిట్‌మ్యాన్
- ఇటీవల ఫామ్‌లేక ఇబ్బంది పడ్డ అతనికి మంచి కమ్‌బ్యాక్
- రోహిత్ ఇలా శతకంతో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వడం పట్ల సర్వత్రా ప్రశంసలు
కటక్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. 76 బంతుల్లో సెంచరీ బాదిన అతడు.. మొత్తంగా 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు నమోదు కావడం విశేషం.
అటు 2023 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ తర్వాత రోహిత్ చేసిన తొలి వన్డే సెంచరీ ఇది. ఇక ఇటీవల ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్ ఇలా శతకంతో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలోనే అతనిపై తోటి ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు.
"మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. దేవుడు గొప్పవాడు" అని ప్రస్తుతం టీ20 క్రికెట్ లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.
"కటక్ లో ఎంత అద్భుతమైన వాతావరణం. రోహిత్ శర్మ అందరినీ ఆకట్టుకున్నాడు" అని పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.
అటు రోహిత్ శర్మతో ఒకప్పుడు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న యువరాజ్ సింగ్ కూడా హిట్‌మ్యాన్ కమ్‌బ్యాక్ అదిరిపోయిందన్నాడు. అతడిని ఎక్కువ రోజులు సైలెంట్‌గా ఉంచలేరంటూ యువీ ట్వీట్ చేశాడు.
"అతను విస్పోటనం లాంటి ఇన్నింగ్స్ తో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు! హిట్‌మ్యాన్ ను ఎక్కువ రోజులు సైలెంట్‌గా ఉంచలేరు. అందరికీ బ్యాట్ తో సమాధానం చెప్పడం అద్భుతంగా ఉంది" అని యువరాజ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.
ఇక రెండో వన్డేలో రోహిత్ శతకానికి తోడు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించింది.
ఈ విజయంతో రోహిత్ సేన మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా కు ఈ విజయం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.