Tirumala: తిరుమ‌ల క‌ల్తీ ల‌డ్డు వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం.. న‌లుగురి అరెస్ట్‌!

Accused Arrested in Tirumala Laddu Adulteration Case

  • దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారం
  • నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు 
  • సిట్ అదుపులో బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌
  • అలాగే వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్దా, ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్ అరెస్ట్‌

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌.. వైష్ణవి డెయిరీ లిమిటెడ్‌ సీఈఓ అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్దా, తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు రాజశేఖరన్ ను అదుపులోకి తీసుకున్నారు. న‌లుగురు నిందితులను ఈరోజు తిరుపతి కోర్డులో హాజరుపరిచే అవకాశం ఉంది. 

సిట్ సభ్యుడు, సీబీఐ జాయింట్ డైరెక్టర్ విరేష్ ప్రభు తిరుపతిలో మకాం వేసి కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు. అనధికార అగ్రిమెంట్లు, రాజకీయ కోణంపై ఆరా తీసిన సిట్ ఈ వ్యవహారంలో అసలు బాధ్యులను గుర్తించినట్లు తెలుస్తోంది. లడ్డూ తయారీ కేంద్రం నుంచి నెయ్యి టెండర్లు, సరఫరా చేసిన సంస్థల వరకు సిట్ పలు కోణాల్లో దర్యాప్తు చేసి, పలువురిని విచారించింది. 

కాగా, లడ్డూ కల్తీ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు పొందిన ఏఆర్‌ డెయిరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్లు సిట్‌ బృందం నిర్ధారించింది. దాంతో నాలుగు రోజులుగా ఏఆర్‌, వైష్ణవి డెయిరీల్లో విచారణ చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. 

అలాగే ఈ డెయిరీలకు చెందిన మ‌రో పది మంది సిబ్బంది సిట్ అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. డెయిరీలకు చెందిన మేనేజర్ల నుంచి అధికారులు, ల్యాబ్ స్టాఫ్, ట్యాంకర్లకు డ్రైవర్లుగా పని చేసిన వారు సిట్ అదుపులోనే ఉన్నట్లు స‌మాచారం. ఏఆర్‌, బోలేబాబా, వైష్ణవి డెయిరీల సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్‌ బృందాలు త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. దీంతో త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Tirumala
Tirumala Laddu Adulteration Case
TTD
Andhra Pradesh
CBI
  • Loading...

More Telugu News