Rohit Sharma: కటక్ వన్డేలో సెంచరీతో రోహిత్ పలు రికార్డులు.. సచిన్‌ను వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్!

- కటక్ వేదికగా భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే
- సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ
- ఇటీవల ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డ హిట్‌మ్యాన్
- శతకంతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
- ఈ సెంచరీతో మూడు రికార్డులు సొంతం చేసుకున్న రోహిత్
ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా కటక్ లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ (119)తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 76 బంతుల్లోనే హిట్‌మ్యాన్ శతకం బాదాడు. 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసి, మునుపటి రోహిత్ ను గుర్తు చేశాడు.
గత కొంతకాలంగా ఫామ్‌లేక ఇబ్బంది పడ్డ రోహిత్ కు ఈ శతకం భారీ ఉపశమనమనే చెప్పాలి. అందులోనూ త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత కెప్టెన్ ఫామ్ లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అటు దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ కావడం గమనార్హం.
ఇక నిన్నటి మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో అతడు 32వ వన్డే సెంచరీని నమోదు చేయడమే కాకుండా, మూడు రికార్డులను అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా హిట్‌మ్యాన్ అధిగమించాడు.
30 ఏళ్ల వయసు తర్వాత అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు
ఈ సెంచరీతో రోహిత్ 30 ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్ గా నిలిచాడు. ముప్పై ఏళ్ల తర్వాత రోహిత్ 36 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో సచిన్ (35) రికార్డును అధిగమించాడు.
భారత ఓపెనర్ గా అత్యధిక 50ప్లస్ స్కోర్లు
కటక్ వన్డేలో సెంచరీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తన 121వ యాభై ప్లస్ స్కోరును నమోదు చేయడం ద్వారా రోహిత్ భారత ఓపెనర్లకు కొత్త బెంచ్‌మార్క్‌ను కూడా సెట్ చేశాడు. గతంలో ఈ రికార్డు సచిన్ (120) పేరిట ఉండేది.
భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లలో రోహిత్ కు రెండో స్థానం
రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఓపెనర్ గా 15,404 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ 15,335 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 రన్స్ తో అగ్రస్థానంలో ఉండగా, హిట్‌మ్యాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.
ఇక నిన్నటి వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ తో భారత్ కు రోహిత్ సూపర్ విక్టరీని అందించాడు. అతనికి తోడు శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ కూడా రాణించడంతో ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది.