director ram gopal varma: సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కోరిన రామ్ గోపాల్ వర్మ

- రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించిన సీఐడీ అధికారులు
- విచారణకు హాజరు కాలేనంటూ సమాధానమిచ్చిన వర్మ
- బిజీ వల్ల 8 వారాల సమయం కోరిన వైనం
గుంటూరులో సీఐడీ అధికారుల ఎదుట వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాల వల్ల రాలేనని ఆయన సమాచారం ఇచ్చారు. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 28న సినిమా విడుదల ఉండటంతో తీరిక లేదని పేర్కొన్నారు. తనకు 8 వారాల సమయం కావాలని, ఆ తర్వాత తేదీ ఇస్తే విచారణకు వస్తానని సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావుకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు.
రామ్ గోపాల్ వర్మపై గత ఏడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన తన ఎక్స్ ఖాతాలో వ్యూహం సినిమా పోస్టర్ పోస్ట్ చేసి చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే, కొన్ని నెలల పాటు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరిగిన ఆయన, ఈ కేసులో న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ పొందారు.
పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించడంతో, ఇటీవల ఒంగోలులో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తాజాగా సీఐడీ నోటీసులు జారీ చేయగా, ప్రస్తుతం విచారణకు రాలేనని, సమయం కావాలని రామ్‌గోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. దీనిపై సీఐడీ అధికారులు ఆయన వినతి మేరకు 8 వారాల సమయం ఇస్తారా? లేక మరోసారి నోటీసు జారీ చేస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.